Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 9

"Sumantra tells story of Rishyasrumga"

With Sanskrit text in Devanagari , Telugu and Kannada


బాలకాండ
తొమ్మిదవ సర్గము

ఏతచ్రుత్వా రహస్సూతో రాజానం ఇదమబ్రవీత్ |
ఋత్విగ్భిరుపదిష్టో యం పురావృత్తో మయా శ్రుతః ||

తా|| ఆదివినిన సూతుడు రహస్యముగా దశరథమహారాజు తో ఇట్లు అనెను." ఋషులు మీకు ఉపదేశించిన విషయము నేను పూర్వకాలములో వినియుంటిని"

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథమ్|
ఋషీణాం సన్నిథౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||
కాశ్యపస్య తు పుత్రో అస్తి విభండక ఇతి శ్రుతః |
ఋష్యశృంగ ఇతి ఖ్యాతః తస్యపుత్రో భవిష్యతి ||
స వనే నిత్య సంవృద్ధో మునిర్వనచరస్సదా |
నాన్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ||

తా|| 'ఓ రాజా ! భగవానునితో సమానుడైన సనత్కుమార మహర్షి ఋషుల సమక్షములో మీకు పుత్రులు పుట్టుట గురించి కథను చెప్పియుండెను. కాశ్యపుని పుత్రుడు విభండకుడనువాడు గలడు . ఆతని పుత్రుడు ఋష్యశృంగుడను పేరు గలవాడు గలడు. అతడు వనములో వృద్దులు మునులు మధ్యలో తిరుగుచుండెను. ఎల్లఫుడు తండ్రిని అనుసరించి , బ్రాహ్మణోత్తములతో తిరుగుట తప్ప వేరొక ప్రపంచము ఎరుగడు '.

ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః |
లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా ||
తస్యైవం వర్తమానస్య కాలస్సమభివర్తత |
అగ్నిం శుశ్రూ షమాణస్య పితరం చ యశస్వినమ్ ||

తా|| ఓ రాజా ! మహాత్ములకు ధర్మశాస్త్రవేత్తలచే చెప్పబడి లోక ప్రసిద్ధమైన రెండువిధములగు బ్రహ్మచర్యముండును. ఋష్యశృంగుడు అగ్నికార్యములనొనర్చుచూ యశస్వి అగు తండ్రి మరియు గురువులను సేవించుచూ రెండు విధములగు బ్రహ్మచర్యము పాటించుచూ ఈ విధముగా కాలము గడుపుచుండెను.

ఏతస్మిన్నే వ కాలేతు రోమపాదః ప్రతాపవాన్ |
అంగేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః ||
తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా |
అనావృష్టిస్సుఘోరా వై సర్వభూతభయావహ ||

తా|| అదే కాలములో ప్రతాపవంతుడు బలవంతుడైన రోమపాదుడు అంగరాజ్యమునకు ప్రభువు గా వుండెను. అతని అక్రమములవలన ఆ ఆరాజ్యములో అనావృష్టి సమస్త భూతములకు భయము కలుగు నట్లు ఏర్పడెను.

అనావృష్ట్యాం తు వృత్తాయాంరాజా దుఃఖ సమన్వితః |
బ్రాహ్మణాన్ శ్రుత వృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి ||
భవంతః శ్రుతధర్మాణో లోక చారిత్ర వేదినః |
సమాదిశంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ||

తా|| తీవ్రమైన ఆనావృష్టి వలన కలిగిన పరిస్థులతో దుఃఖము పొందిన ఆ రాజు వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిచి ఇట్లు పలికెను. "మీరందరూ ధర్మమునూ లోకవృత్తాంతములను ఎరిగినవారు. ఈ పరిస్థితులకు ప్రాయశ్చిత్తముగా చేయతగిన నియమములను చెప్పువలెను " అని.

వక్ష్యంతి తే మహిపాలం బ్రాహ్మణా వేదపారగః |
విభండకసుతం రాజన్ సర్వోపాయైరిహానయ ||
అనాయ్య చ మహీపాల ఋష్యశృంగం సుసత్కృతమ్ |
ప్రయచ్చ కన్యాం శాంతాం వై విథినా సుసమాహితః ||
తేషాం తు వచనం శ్రుత్వా రాజాం చితాం ప్రపత్స్యతే |
కేనోపాయేన వై శక్యం ఇహానేతుం స వీర్యవాన్ ||

తా||వారు ఆ మహీపాలునకు ఇట్లు చెప్పిరి " ఓ రాజావిభంఢక సుతుని ఏవిధముగనైననూ ఇచటికి తీసుకురావెలెను. అట్లు ఆ ఋష్యశృంగుని పిలిపించి , సత్కరించి , కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహము యథావిథిగా వివాహము చేయుడు " ఆ వచనములను విన్న వీరుడైన ఆమహారాజు 'ఏవిధముగా ఆయనను ఇచటికి రప్పించ వలెను అని ఆలోచింపసాగెను.

తతో రాజా వినిశ్చిత్యసహమంత్రిభిరాత్మవాన్ |
పురోహితం అమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్ ||
తే తురాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః |
న గచ్చేమ ఋషేర్భీతా అనునేష్యంతి తం నృపమ్ ||

తా|| అప్పుడు ఆ రాజు మంత్రులతో కూడా విచారించి పురోహితుని అమాత్యులను సత్కరించి పంపుటకు నిశ్చయించెను. వారు రాజుమాటలనువిని కలవరపడి వినమ్రముతో " ఓ రాజా ! ఆ ఋషి అనిన మాకు భయము కావున మేము వెళ్ళజాలము . కాని ఆయనను తీసుకు వచ్చు విధానము చెప్పెదము."

వక్ష్యంతి చింతయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్ క్షమాన్ |
అనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి ||
ఏవమంగాధిపేనైవ గణికాభిః ఋషేః సుతః |
అనీతోsవర్షయద్దేవ శాంతా చాస్మై ప్రదీయతే ||

తా || వారు అట్లు ఆలోచించి ఆ రాజుతో ఇట్లు చెప్పెదరు." మనకు ఎట్టి దోషము కలుగకుండా ఆ బ్రాహ్మణుని ఇచటికి రప్పించెదము " అని. అంతట అంగరాజైన రోమపాదుడు గణికలద్వారా ఆ ఋషియొక్క కుమారుడిని రప్పించును. ఆయనరాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగును. పిమ్మట రాజు తనకుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహము జరిపించును.

ఋష్యశృంగస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి|
సనత్కుమార కథితం ఏతావద్వ్యాహృతం మయా ||

తా|| "ఓ రాజా ఆ ఋష్యశృంగుడు కూడా మీ అల్లుడే . ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుదురు. ఇట్లు ఆ సనత్కుమారుడు చెప్పిన వృత్తాంతమును మీకు తెలిపితిని "

అథ హృష్టో దశరథః సుమంత్రం ప్రత్యభాషత |
యథర్శ్యత్శృంగ స్త్యానీతో విస్తరేణ త్వయోచ్యతామ్ ||

తా|| అందులకు ఆ దశరథుడు మిక్కిలి సంతశించి సుంమంత్రునితో ఇట్లుపలికెను " రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశమునకు రప్పించిన రీతిని వివరింపుము " అని.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే నవమస్సర్గః
సమాప్తమ్ ||

|| om tat sat ||